సాంకేతిక కారణాల వలన ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయడం లేదు. నిరంతర అఫ్డేట్స్ కొరకు www.tsutfmlg.in లింక్ ని క్లిక్ చేయండి

Mirror

గత కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న ‘ఆకాశ్’ టాబ్లెట్ విడుదలయ్యింది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి కబిల్ సిబాల్ బుధవారం ‘ఆకాశ్’ ను విడుదల చేశాడు. విద్యార్ధులకు, పేదలకు సైతం కంప్యూటర్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన ‘ఆకాశ్’ టాబ్లెట్ మొదటి విడత లక్ష ఉత్పత్తులను విద్యార్ధులకు ఉచితంగా ఇస్తామని కపిల్ సిబాల్ ప్రకటించాడు.
‘డేటా విండ్’ అనే బ్రిటిష్ కంపెనీ ‘ఆకాష్’ ను తయారు చేస్తోంది. ఆ కంపెనీయే ‘ఆకాష్’ ను అభివృద్ధి చేసింది. మొదటి లక్ష యూనిట్లను విద్యార్ధులకు ఉచితంగా ఇచ్చాక తర్వాత నుండి ఒక్కో యూనిట్ ను సబ్సిడీ ధర 35 డాలర్లకు (రు.1600/-) ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. డేటా విండ్ నుండి ప్రభుత్వం ఒక్కో యూనిట్ ను 50 డాలర్లకు కొనుగోలు చేస్తుంది.
సాధారణ రిటైల్ ధర 60 డాలర్లుగా నిర్ధారించారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం అయితే ధర ఇంకా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో కపిల్ సిబాల్ విద్యార్ధులకు ఉచితంగా కొన్ని యూనిట్లను పంపిణీ చేశాడు. అయితే పేదలకు ఉద్దేశించిన ‘ఆకాశ్’ టాబ్లెట్ ను మొట్టమొదట ఉచితంగా అందుకున్న విద్యార్ధులు మాత్రం పేదలు కాకపోవడం విశేషం.
ఉచిత టాబ్లెట్ అందుకున్న నికాంత్ వోరా ఇలా అంటున్నాడు, “ఇది ఇంకా బాగా తయారు చెయ్యవచ్చు. ధరను మాత్రమే ఉద్దేశంలో పెట్టుకుని చూస్తే, ఫర్వాలేదని చెప్పుచ్చు. కాని మాకు ల్యాప్ టాప్ లు ఉన్నాయి. ఐ పాడ్స్ ఉపయోగించాము. కనుక మాకు తేడా బాగా తెలుస్తోంది” అని చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
అప్పటికే లాప్ ట్యాప్ సొంతానికి కలిగి ఉండి, ఐ పాడ్స్ కూడా వాడి ఉన్న విద్యార్ధులని పిలిచి ఉచితంగా ఇచ్చిన కపిల్ సిబాల్ తర్వాతైనా పేదలను దృష్టిలో ఉంచుకోగలడా? కపిల్ సిబాల్ వంటి మార్కెట్ శక్తుల స్నేహితుడికి పేదలంటే ఎవరో తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదనుకుంటా.
అమెజాన్ కంపెనీ ‘కిండల్ ఫైర్’ పేరుతో టాబ్లెట్ ను కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. ఇది ఏపిల్ కంపెనీ తయారు చేస్తున్న ఐ పాడ్ కు పోటీ వస్తున్నదని ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో ‘ఆకాశ్’ విడుదలపై కొంత ఆసక్తి నెలకొంది. కానీ ‘ఆకాశ్’ క్వాలిటీ పట్ల పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి చెయ్యొచ్చు అని సరిపెట్టుకుంటున్నారు.
ప్రతి నెలా కొత్తగా 19 మిలియన్ల మంది మొబైల్ ఫోన్లకు సబ్‌స్క్రైబ్ చేస్తున్నారని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. ఫలితంగా ఇండియా మార్కెట్ ప్రపంచ స్ధాయి కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. అకాశ్ టాబ్లెట్ లో గూగుల్ కంపెనీ రూపొందించిన ‘యాండ్రాయిడ్’ ఆపరేటింగ్ సిస్టం ను వినియోగిస్తున్నారు. టచ్ స్క్రీన్ కాకుండా ఎల్.సి.డి స్క్రీన్ కలిగి ఉంది.
“డిజిటల్ ప్రపంచం కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉంది. పేదలు సాధారణ ప్రజలు మినహాయించబడ్డారు. ‘ఆకాశ్’ ఆ డిజిటల్ విభజనను అంతం చేస్తుంది” అని చెబుతున్న కపిల్ సిబాల్, వైర్ లెస్ బ్రాడ్ బాండ్ కనెక్షన్ తో తయారు చేసిన ఆకాశ్‌తో, ‘వైర్‌లెస్ బ్రాడ్ బాండ్’ కేవలం ధనికులకే అందునా పట్టణ ప్రజాజీకానికే విరివిగా అందుబాటులో ఉన్న నేపధ్యంలో, డిజిటల్ విభజన ను ఎలా అంతం చేస్తారో వేచి చూడవలసిందే.   courtesy : http://teluguvartalu.wordpress.com